రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలి
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబరు 30, (మనసాక్షిగొంతుక) : జిల్లాలో రహదారి భద్రతను పటిష్టం చేసి ప్రమాదాల నివారణకు చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్, లైటింగ్, సైనేజ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణపై సమీక్షించారు. స్టేషన్ ఘన్‌పూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీ పనులను వేగవంతం చేయాలని, కోమల్ల టోల్ ప్లాజా, రైల్వే స్టేషన్, కరుణాపురం ప్రాంతాల్లో అనధికార పార్కింగ్‌ను తొలగించాలని ఆదేశించారు. హైవేలపై అవసరమైన చోట్ల రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించాలని సూచించారు. పాఠశాల బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరును తనిఖీ చేయాలని తెలిపారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లోనే వైద్యం అందేలా గ్రీన్ ఛానల్, ఆసుపత్రులు రూట్ మ్యాపింగ్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో ఆర్డీఓలు, పోలీస్, ఆర్టీఏ, ఎన్‌హెచ్‌ఏఐ, మున్సిపల్, వైద్య, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.









